Nojoto: Largest Storytelling Platform

ఏ చిరునవ్వులు మందవుతాయో చెలరేగే గాయాలకు ఏ స్పర్శల

ఏ చిరునవ్వులు మందవుతాయో చెలరేగే గాయాలకు 
ఏ స్పర్శలు సరిచేస్తాయో చెదిరిపోతున్న గమ్యాలను 
తుంచుకుని వెళ్లిపోవడంఅంటే అంత సులువేమీ కాదు 
అదో అతి పెద్ద ప్రక్రియ 
అంటుకట్టిన హృదయాలను అతినెమ్మదిగా 
వేరు చేయాలి
వేల వేల శస్త్రచికిత్సలు చేసి 
పెనవేసుకున్న భావాలను అతి ఓపిగ్గా 
విడదీయాలి 
కోట్ల కోట్ల క్షణాలను ఖర్చుపెట్టి 
అయినా వదిలించుకుందామంటే వదిలేదు కాదు బంధం 
అవశేషాలు అడ్డుపడుతూనే ఉంటాయి అడుగడుగునా 
నీడలు వెంటాడుతూనే ఉంటాయి అనునిత్యం 
పక్కింట్లో పూచినా పువ్వుల్లోనో 
ఎదురుపడిన బాబు నవ్వుల్లోనో 
పంచుకున్న శీతాకాలపు సాయంత్రపు ఛాయల్లోనో 
పెంచిపోషించుకున్న కలల్లోని కలవరింతల్లోనో 
విశేషంగా నిలబడే ఉంటాయి బంధాలు
అనుక్షణం అడ్డుతగులుతుంటాయి 
అతిసమీపంగా సంచరిస్తుంటాయి 
అందుకే అందుకే అనుబంధాలకు అంతం లేదు 
వాటి భాగం ఎప్పుడూ సున్నాలాంటి  శేషం కాదు 
పుటుక్కున తెంపేయగానే తెగిపోతే అవి బంధాలెందుకు అవుతాయి 
మనుష్యులంతా మన ఆత్మబంధువులెందుకవుతారు

©gopi kiran
  #Poetry #kavita #Telugu #SAD #motivate